మనమంతా ఏదో ఒక సమయంలో ఫోన్ పోగొట్టుకొని ఉండవచ్చు. అందులో ముఖ్యమైన, వ్యక్తిగత  సమాచారం ఉంటుంది. అదంతా మన చేయి దాటి పోతుంది. అప్పుడెలా..? ఏం చేయాలి..? ఎవరిని సంప్రదించాలి..? ఏం చేస్తే తిరిగి మన డేటా మనకి అందుతుంది. ఇలాంటి సందేహాలు మనకి కలిగి ఉండవచ్చు.

నిజానికి ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాని స్మార్ట్‌ఫోన్‌లోనే స్టోర్ చేసుకుంటున్నారు.ఎంత కీలకమైన సమాచారమైనా స్మార్ట్ ఫోన్ నుండే ఆపరేట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్ ని పోగొట్టుకున్నా, ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, లేదా దొంగతనానికి గురైనా వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఫోన్ లో ఉన్న డేటా దుర్వినియోగం కాకముందే ఎలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎలాగో… ఏంటో… ఇప్పుడు తెలుసుకుందాం.

వెంటనే కాల్ చేయాలి:

పొరపాటున మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే, వెంటనే అందుబాటులో ఉన్న మరో ఫోన్ తో మీ నెంబర్ కి కాల్ చేయండి. అవతలి నుండీ ఎవరైనా లిఫ్ట్ చేస్తారేమో చూడండి. ఒకవేళ ఎవరైనా మీ కాల్ కి ఆన్సర్ చేస్తే… విషయం చెప్పి చిన్నగా మీ ఫోన్ ని తిరిగి పొందేలా చూడండి.

సిమ్ కార్డ్స్ బ్లాక్ చేయాలి:

పోగొట్టుకున్న మీ ఫోన్ కి మీరు కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయనట్లయితే, వెంటనే వేరే మొబైల్ నుండీ సర్వీస్ ప్రొవైడర్‌కు కాల్ చేయండి. సర్వీస్ సెంటర్‌కు కాల్ చేసి, వెంటనే మీ నంబర్‌పై ఔట్‍గోయింగ్ కాల్స్ ని బ్లాక్ చేయాలని తెలపండి. మీ వివరాలు కరెక్ట్ గా ఉంటే… వాళ్ళు వెంటనే బ్లాక్ చేస్తారు.

ఫైండ్ మై డివైజ్‌తో లొకేట్ చేయాలి:

దాదాపు స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలోనూ ఫైండ్ మై డివైజ్ ఆప్షన్ ఆన్‌లోనే ఉంటుంది. దానిని మీ గూగుల్ ఎకౌంట్ తో లింక్ చేసి ఉంటే… మిస్సయిన మీ ఫోన్‌ ఎక్కడుందో వెంటనే లొకేట్ చేయగలుగుతుంది. అందుకే, మీరు మీ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే వేేరే ఏదైనా స్మార్ట్‌ఫోన్‌లో నుండైనా, లేదా కంప్యూటర్ నుండైనా ఫైండ్ మై డివైజ్ ఓపెన్ చేసి, మీ జీమెయిల్‌తో లాగిన్ అవండి. మీ మెయిల్ ద్వారా  ఫైండ్ మై డివైజ్ ఎంచుకుంటే మీ ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉందో కనిపెట్టవచ్చు. కానీ, మీ మొబైల్ లో డేటా, మరియు జీపీఎస్ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అంతేకాదు,ఈ రెండూ ఆఫ్‌లో ఉంటే, చివరగా మీ ఫోన్ ఎక్కడ ఆన్‌లో ఉందో… ఆ ఏరియాను మ్యాప్‌లో చూపుతుంది.

ఫైండ్ మై డివైజ్‌తో లాక్ వేయాలి:

పోగోట్టుకుపోయిన మీ ఫోన్‌కు ఫైండ్ మై డివైజ్‌ ద్వారా  లాక్ వేయవచ్చు. అలాగే, ఆ లాక్ స్క్రీన్‌పై కనపడేలా మెసేజ్ చేయాలి. ఇంకా ఆ ఫోన్ ఓనర్ మీరేనని తెలిపేలా కాంటాక్ట్ నంబర్‌ ని జోడించి… అది దొరికిన వారికి కనపడేలా  మెసేజ్‌ చేయొచ్చు. 

ఫోన్‌ డేటా డిలీట్ చేయాలి:

ఎంతగా ప్రయత్నించినా మీ ఫోన్ ఇక దొరకదు అని నిర్ణయానికి వచ్చాక ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. అదే డేటా ఎరేజ్. మీ ఫోన్లో ఉన్న పూర్తి డేటాని ఎరేజ్ చేయాలి. అలా చేస్తే మీ డేటా దుర్వినియోగం కాదు.

IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలి:

ప్రతీ స్మార్ట్‌ఫోన్‌కు ఐఎంఈఐ నంబర్‌ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే, ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఐఎంఈఐ నంబర్‌ బ్లాక్ చేసేయాలి. అందుకోసం https://www.ceir.gov.in/Home/index.jsp వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ నంబర్‌ ని బ్లాక్ చేయవచ్చు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి:

అన్ని రకాలుగాను స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్ చేసిన తర్వాత చివరిగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఇలా అయితే ఒకవేళ మీ ఫోన్‌ను ఎవరైనా మిస్-యూజ్ చేసినా మీరు ప్రమాదంలో పడరు.

ఫ్రెండ్స్! తెలుసుకున్నారు కదా! ఇకపై ఎప్పుడైనా మీ స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు ముందుగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. అప్పుడు మీ పర్సనల్ డేటా మిస్-యూజ్ కాకుండా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.