ఏపీ ప్రభుత్వం తాజాగా విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ పాఠశాలలకి పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అధునాతన విద్యని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అందుకోసం ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ అయిన ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది.
ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు కోసం జగన్ గవెర్నమెంట్ మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులని, ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేయాలన్నదే ఆయన ఉద్దేశ్యం. అందుకోసం, బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్తో సీఎం జగన్ సమావేశమయ్యారు.
గత కొద్ది రోజుల క్రితం దావోస్ వెళ్ళిన జగన్… అక్కడ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు. వివిధ రకాల యూనికార్న్ స్టార్టప్స్ తో ఆయన సమావేశమయ్యారు. సరిగ్గా అదే సమయంలో బైజూస్ కంపెనీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఎప్పుడైనా, ఎక్కడైనా, నేర్చుకునే వీలుండేలా ఇ– లెర్నింగ్ ఎడ్యుకేషనల్ సిస్టంని ప్రవేశపెట్టాలని కోరారు. ఏడాదికి కనీసం రూ.20 వేల నుంచి రూ.24 వేలు చెల్లిస్తేనే కాని లభ్యమవ్వని ‘బైజూస్’ ఇ– క్లాసెస్ ని తమ రాష్ట్రంలో చదువుకొనే గవర్నమెంట్ స్కూల్ విద్యార్దులకోసం ఉచితంగా అందించాలని తెలిపారు. ఈ విద్య పేద పిల్లల జీవితాలను మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే పదోతరగతిలో సీబీఎస్ఈ సిలబస్ లో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహదపడుతుంది. ఇకపై 4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ ఎడ్యుకేషనల్ సిస్టం కోసం ప్రతి విద్యార్ధికీ ట్యాబ్లు కూడా అందిస్తామని సీఎం తెలిపారు. అందుకోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నాము. ఈ సెప్టెంబరులోనే 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు కూడా అందిస్తారు. వచ్చే ఏడాది నుంచి బైజూస్ కంటెంట్ కలిగి ఉన్న పాఠ్యపుస్తకాలను ముద్రిస్తారు. ఇక ప్రతి తరగతి గదిలో టీవీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.