జనసైనికులంతా రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు హెచ్చరించారు. అందుకోసం వారికి కొన్ని మార్గదర్శకాలు కూడా చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ ట్వీట్ కూడా చేశారు. ఇదే విషయమై అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు నాగబాబు వరుస ట్వీట్లు చేయడం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ప్రత్యర్థులు మైండ్ గేమ్‌కు తెరలు తీసినట్లు కొన్ని సంఘటనలు చెప్పకనే చెబుతున్నాయి.
- జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికో… లేక కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికో… ప్రత్యర్థులు కొన్ని అనూహ్యమైన ప్రచారాలను వ్యాపింపజేస్తున్నారు.
- ఈ ప్రచారాలు ఏ ఫలితం ఆశించి చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఎవరెవరున్నారు అనే వాస్తవాలను గమనించడం, లేదా నిర్ధారించుకోవడం చాలా అవసరం.
- సోషల్ మీడియాలో మనకు అనుకూలంగానో, లేదా వ్యతిరేకంగానో కొన్ని వార్తలు కానీ, లేదా ఆర్టికల్స్ కానీ రావటం జరుగుతోంది. ఇటువంటి రూమర్లు మనం కోరుకోకుండానే మన వాట్సాప్ గ్రూపుల్లోనో, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారానో మన మొబైల్స్ కు చేరుకుంటాయి. ఇలాంటి వాటిని చూసే వెంటనే ఒక నిర్ణయానికి రావొద్దు. విచక్షణతో ఆలోచించండి. వీలైతే సీనియర్లతో సంప్రదించండి. దాని ఉద్దేశం ఏమిటో శోధించండి. అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం.
- ఈ మైండ్ గేమ్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతోమంది నిపుణులు, అనుభవజ్ఞులైన టెక్కీలు పని చేస్తుంటారు. అందువల్ల మనం అప్రమత్తతగా లేకపోతే వీళ్ల బుట్టలో పడే ప్రమాదం ఉంది.
- సోషల్ మీడియాలో ఒక పోస్టు కనిపించగానే దానిపై కామెంట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. మీరు చేసే కామెంట్ పార్టీకి నష్టం చేస్తుందా? లేక లాభం చేస్తుందా ? అనే విషయాన్ని ఒక్కసారి విచక్షణతో ఆలోచించండి.
- ప్రత్యర్థులను నియంత్రించేందుకు మనం పెట్టే పోస్టులు సరళంగా… ప్రజలకు అర్థమయ్యేలా… ఆలోచింపజేసేలా… మాత్రమే ఉండాలి. ఎక్కడా హద్దులు మీరకూడదు.
- ఈ మైండ్ గేమ్ లో మరో కోణం ఏంటంటే… అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడటం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలు చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని భావించి, చప్పట్లు, హ్యాపీ ఎమోజీలు పెట్టారో… ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే! అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా! అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి.
- ప్రత్యర్థులు మన పార్టీని కానీ, నన్ను వ్యక్తిగతంగా కానీ తూలనాడినా… మనం తిరిగి అతడిని విమర్శించేటప్పుడు కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. మనం ఒకటి అన్నప్పుడు వాళ్ళు నాలుగు మాటలు అనడం సహజం. ఆ నాలుగు మాటల వల్లనే ప్రజల్లో అతనికి సానుభూతి కలగదు.
- ప్రత్యర్థి దూషణలకు, విమర్శలకు తగిన మోతాదులోనే స్పందించి సమాధానం చెప్పాలి. మోతాదు పాళ్లు మించకుండా చూసుకోవాలి. వాడే భాషలోగానీ, చేసే ఆరోపణలలోగానీ, రీజన్ ఉండాలి. ఎదుటివారు కూడా వీళ్లు మాట్లాడుతుంది కరెక్టే అనే భావన కలగాలి.
- ప్రత్యర్ధి పార్టీ గానీ, పార్టీ నేతలు గానీ మనపై విమర్శలు చేసిన పోస్టులు వస్తే అవి సదరు పార్టీ, లేదా నేత చేశారో లేదో ముందు నిర్ధారించుకోండి. ఆ తరవాతే స్పందించండి. కొన్ని ఫేక్ పోస్టులు మైండ్ గేమ్ లో భాగంగా సర్క్యులేట్ అవుతుంటాయి. అప్రమత్తంగా ఉండాలి. అంటూ హెచ్చరించారు మెగా బ్రదర్ నాగబాబు.