NHAI Enters Guinness World Records for Building 75 kms Highway

మోదీ సర్కార్ ఏనిదేళ్ల పాలను పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మరో అరుదైన రికార్డును దక్కించుకుంది. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి… భారత్ పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్సులో సువర్ణాక్షరాలతో లిఖించేలా చేసింది. ఈ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ కేవలం 5 రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో అంతకుముందు ఖతర్‌ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డుని బద్దలు కొట్టింది భారత్. 

ఈ విషయాన్ని మరెవరో కాదు, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేశారు. అంతేకాదు, గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో పాటు, రోడ్డు నిర్మాణ ఫొటోలను కూడా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

అమరావతి-అకోలా మధ్య 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అయితే, దీనిని అతి తక్కువ సమయంలోనే అంటే… 105 గంటల 33 నిమిషాలలోనే పూర్తి చేసింది. కొత్తగా నిర్మించిన ఈ రహదారి NH-53లో భాగం. దీని నిర్మాణం కోసం NHAIకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా, ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు పనిచేశారు. జూన్ 3వ తేదీ ఉదయం 7గంటల ప్రాంతంలో ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులు… జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకల్లా విజయవంతంగా ముగిసాయి.

ఇది మొత్తం జాతికే గర్వకారణం. ఆజాది కా అమృత్ మ‌హోత్సవ్‌లో భాగంగా మన దేశం మరింత ముందుకు సాగుతోంది. న్యూ ఇండియా ప్రతిష్ట మరింత పెరుగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ వృద్ధి చెందుతుంది అంటూ గడ్కరీ పేర్కొన్నారు. 

ఈ రహదారి కోల్‌కతా, రాయ్‌పూర్, నాగ్‌పూర్, అకోలా, ధులే, సూరత్ వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్టును NHAI ఆధ్వర్యంలోని రాజ్‌పుత్‌ ఇన్‌ఫ్రాకాన్‌ అనే సంస్థ చేపట్టింది. గతంలో కూడా ఈ సంస్థ సాంగ్లీ-సతారా మధ్య 24 గంటల్లో ఓ రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 

ఇకపోతే, ఇప్పటి వరకు అతి తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసిన రికార్డు ఖతర్‌కు చెందిన అష్ఘల్ (ASHGHAL) పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ పేరిట ఉంది. 2019, ఫిబ్రవరి 17న అల్‌-ఖర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై 75 కి.మీ. రోడ్డును ఈ సంస్థ  10 రోజుల్లో నిర్మించి రికార్డు సృష్టించింది. తాజాగా ఆ రికార్డును భారత్ బద్దలు కొట్టింది. 

Leave a Reply

Your email address will not be published.