కేరళలో మరో కొత్త వైరస్‌ కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ని మరువక ముందే రకరకాల వైరస్ లు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా గతేడాది కేరళని వణికించిన నోరోవైరస్‌… మళ్ళీ ఇప్పుడు విజ్రుమ్బించింది. 

తాజాగా కేరళలోని తిరువనంతపురంలోని విజింజం ప్రాంతంలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు తెలిసింది. అయితే, ప్రస్తుతానికి ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్య  పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కానీ, ఈ వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచించారు. 

ఈ చిన్నారులిద్దరూ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగి డయేరియాతో బాధపడటం గమనించి టెస్ట్ చేయించగా… వారికి  నోరోవైరస్  ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. స్కూల్ లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పిల్లలకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లు తేలింది. దీంతో ఆ పాఠశాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు సమాచారం.

నోరోవైరస్ లక్షణాలు:

నోరోవైరస్ అనేది ఓ అంటువ్యాది. ఇది తిన్న ఆహారం, లేదా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. నోరోవైరస్ సోకిన వ్యక్తి తాకిన వస్తువులను తాకడం, లేదా ఆ  వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల కూడా వ్యాప్తి చెందవచ్చు.  

నోరో వైరస్‌ సోకిన రోగులు ఎవరైనా సరే వాంతులు, విరేచనాలు, తలనొప్పి, శరీర నొప్పులతో బాధపడుతుంటారు. అందుకే, తాగునీరు పరిశుభ్రంగా ఉండాలి. అలానే, లావెటరీని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొంతమేర దీనిని అరికట్టవచ్చు.

Leave a Reply

Your email address will not be published.