ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నాణాలని విడుదల చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ (AKAM) వేడుకల్లో భాగంగా ఐకానిక్‌ వీక్‌ సెలబ్రేషన్స్‌ను ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా ఆయన ఈ నాణాలను విడుదల చేశారు.

కేంద్ర ఆర్ధికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. అదే సమయంలో ఈ కొత్త నాణేలని కూడా ఆవిష్కరించారు. 

మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపధ్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌  లోగోను రిలీజ్ చేశారు మోదీ. ఇక ఈ  వేడుకలను పురస్కరించుకొని రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణాలను రూపొందించారు. అయితే ఇవి కేవలం మెమోరియల్ కాయిన్స్ మాత్రమే కాదని, త్వరలోనే అవి  చలామణిలోకి వస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా  గత 8 ఏళ్ల తన పాలనలో దేశంలో ఎన్నో ఆర్ధిక సంస్కరణలను అమలు చేసినట్టు తెలిపారు. 12  గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబందించిన  ‘జన సమ్మర్థ్‌ పోర్టల్‌’ను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు. 

డిజిటల్‌ పేమెంట్స్‌కు నానాటికీ డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో భారత్‌ ఇప్పటికే అనేక ఫైనాన్షియల్ ప్లాట్ ఫామ్స్ ని ఆవిష్కరించింది. అందులో భాగంగానే ముద్ర స్కీమ్ ద్వారా చిరు వ్యాపారులకు వేగంగా రుణాలు అందేలా చేసింది. ఇక వీటి వినియోగాన్ని మరింత పెంచడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని కూడా నిర్వహించాలని తమ ప్రభుత్వం యోచిస్తుందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. 

అయితే ప్రపంచవ్యాప్తంగా భారత్ ని అతి పెద్ద కన్జ్యూమార్  మార్కెట్‌గానే కాకుండా అనేక సమస్యలకు పరిష్కార వేదికగా కూడా మార్చాలని తమ ప్రభుత్వం చూస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ నాణాల ప్రత్యేకత:

ఇక ఈ నాణాల విషయానికొస్తే, అన్ని  ఇతర నాణేల వలె గుండ్రంగా ఉండకుండా… బహుభుజి ఆకారంలో ఉంటాయి.  నాణెం మధ్యలో అశోక స్తంభం, మరియు సింహాలు కనిపిస్తాయి. ఈ నాణాల తయారీకి వెండి, ఇత్తడిని, మరియు నికెల్ వంటి లోహాలని ఉపయోగించారు.

ఇది మాత్రమే కాదు, కంటిచూపు లేనివారు, దృష్టి లోపం ఉన్నవారు కూడా సులభంగా గుర్తించేలా ఈ నాణాలు తయారుచేయబడ్డాయి. అందుకోసం వీటిపై బ్రెయిలీ లిపి ముద్రించబడి ఉంది. 

ఇంకా ఈ కొత్త నాణాలు దేశాభివృద్ధి కోసం పనిచేసేలా ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయని, అలాగే, అమృత్‌ కాలం నాటి అద్భుత ఘడియలను ప్రజలకు నిరంతరం గుర్తు చేస్తాయని కూడా ఈ సందర్భంగా మోదీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.